﻿కీర్తనలు.
149.
యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి. 
ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక. 
వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు. 
యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు. 
ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక. వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక. 
వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక. 
దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి, 
వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి. 
