﻿కీర్తనలు.
138.
దావీదు కీర్తన. యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను. 
మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను మీరు అధికంగా ఘనపరిచారు. 
నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు. 
యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 
యెహోవా మహిమ గొప్పది కాబట్టి, వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక. 
యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు. 
నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు. 
యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, మీ చేతిపనిని వదిలిపెట్టకండి. 
