﻿కీర్తనలు.
75.
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు. 
“నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను. 
భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా 
అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి. 
ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు. 
తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు. 
దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు. 
యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు. 
నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను. 
ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు. 
