﻿కీర్తనలు.
61.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి. 
భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి. 
ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము. 
మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా 
దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు; మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు. 
రాజు జీవితకాల దినాలను పొడిగించండి, అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి. 
అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి. 
అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను. 
