﻿కీర్తనలు.
57.
సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను. 
నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను. 
పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు. 
నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి. 
దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. 
నా పాదాల చుట్టూ వలలు వేశారు, నేను బాధతో క్రుంగి ఉన్నాను నా దారిలో వారు గుంట త్రవ్వారు కాని అందులో వారే పడ్డారు. సెలా 
ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, నా హృదయం స్థిరంగా ఉంది; నేను పాడతాను సంగీతం వాయిస్తాను, 
నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను. 
ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను. 
ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది. 
దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. 
