﻿కీర్తనలు.
54.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి. 
ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి. 
అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా 
ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు. 
నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి. 
యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది. 
మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి. 
