﻿కీర్తనలు.
53.
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు. 
అర్థం చేసుకునేవారు, దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు 
ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు ఒక్కరు కూడా లేరు. 
కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు. 
అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర, వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు. మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు; దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు. 
సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక! 
