﻿కీర్తనలు.
39.
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను. 
అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. కానీ నా వేదన అధికమయ్యింది; 
నా గుండె నాలో వేడెక్కింది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; అప్పుడు నోరు తెరచిమాట్లాడాను: 
“యెహోవా, నా జీవిత ముగింపు నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి. 
మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా 
“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు. 
“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ. 
నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి; మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి. 
ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. 
దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి; మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను. 
మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా 
“యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను. 
నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా మీ చూపును నా నుండి త్రిప్పివేయండి.” 
