﻿కీర్తనలు.
12.
సంగీత దర్శకునికి. షెమినీతు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు. 
ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు. 
పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక. 
“మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు. 
“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు. 
యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి. 
యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు, 
మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. 
