﻿కీర్తనలు.
3.
దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు! 
“దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా 
కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు. 
నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా 
నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను. 
అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. 
యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి. 
రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా 
