﻿కీర్తన..
142.
దావీదు ధ్యాన గీతం. అతడు గూహలో ఉన్నప్పటి ప్రార్థన. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను. 
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. 
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. 
నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు. 
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు. 
యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు. 
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను. 
