﻿కీర్తన..
138.
దావీదు కీర్తన. దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను. 
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు. 
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు. 
యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు. 
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా మహిమ గొప్పది. 
దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్వష్టులు చేసే పనులు యెహోవాకు తెలుసు. కానీ ఆయన వారికి సన్ని హితంగా ఉండడు. 
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము. 
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు. 
