﻿కీర్తన..
32.
దావీదు కీర్తన. పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు. 
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించని వాడు ధన్యుడు. 
దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. కానీ నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను. 
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు. తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను. 
అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు. 
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి. 
దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను. 
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను. 
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.” 
చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరిస్తుంది. 
మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి. పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి. 
